prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:37 am Digital Edition : PRAJA VANI

ఫామ్‌హౌస్ భూములపై కాంగ్రెస్ నేతల ఫోకస్

*ఫామ్‌హౌస్ భూములపై కాంగ్రెస్ నేతల ఫోకస్*

*-మద్దూరులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ను పరిశీలించిన కాంగ్రెస్ బృందం*

*- ప్రభుత్వ భూములు, ఇనాం, అసైన్డ్ భూములపై రెవెన్యూ వివరాలు తీసుకుని సీఎంకు నివేదిక ఇస్తామని వెల్లడి*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి

ప్రభుత్వ భూములు, అసైన్డ్‌, ఇనాం భూములను పరిరక్షించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నాయకుల బృందం సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామంలోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉదయం ప్రజాభవన్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు మద్దూరుకు చేరుకుని ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూముల వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని భూముల ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. గతంలో సాధారణ వ్యవసాయం చేసుకునే స్థితిలో ఉన్న వ్యక్తులకు పదేళ్ల పాలనలో భారీగా ఆస్తులు ఎలా సమకూరాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీగా భూములు, ఆస్తులు ఎలా సమకూరాయనే అంశంపై సమగ్రంగా విచారణ జరగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. షాబాద్ మండలం మద్దూరులో ఉన్న ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల్లో కూడా కొన్ని భూములు ఇనాం భూములుగా ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం అందిందని వారు తెలిపారు.

*12 ఎకరాల ఇనాం భూమిపై విచారణకు డిమాండ్*

మద్దూరులోని ఫామ్‌హౌస్‌కు సంబంధించిన సుమారు 50 ఎకరాల భూమిలో దాదాపు 12 ఎకరాలు ఇనాం భూమిగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అయితే ఈ భూముల హక్కులు, రికార్డులు, యాజమాన్య వివరాలు అధికారికంగా పూర్తిస్థాయిలో నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గత పదేళ్లలో ప్రభుత్వ, ఇనాం, అసైన్డ్‌ భూములకు సంబంధించి జరిగిన ఆక్రమణలపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూముల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

*ప్రభుత్వ భూములు గుర్తించి ప్రజలకు అందేలా చర్యలు*

ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు తేలితే వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. భూముల రికార్డులను పరిశీలించి, 1950ల నుంచి ఇప్పటి వరకు భూముల హక్కుల్లో జరిగిన మార్పులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేస్తామని చెప్పారు.
చట్టపరంగా ప్రభుత్వానికి చెందిన భూములు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ అయితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంపద దుర్వినియోగమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది త్యాగాలు చేస్తే, ఆ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో కొందరు నాయకులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చిన వారికి ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్,, చామల కిరణ్ కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, వీర్ల శంకర్, కుంభం అనిల్, మందుల సామ్యూల్, బత్తుల లక్ష్మా రెడ్డి,ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కావలి చంద్రశేఖర్ జనార్దన్ రెడ్డి నరేందర్ రెడ్డి మహేందర్ గౌడ్ రామ్ రెడ్డి రాజు నాయక్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.