*ప్లాస్టిక్ రహిత గ్రామంగా భూపతిపూర్ ను తీర్చి దిద్దుతాం*
*రాయికల్ ;సెప్టెంబర్ 27 (ప్రజావాణి):*
పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపతిపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గ్రామస్థులు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఆదివారం గ్రామంలోని ప్రధాన వీధులు, రహదారుల వెంట పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు “ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి – పర్యావరణాన్ని కాపాడండి”, “ప్లాస్టిక్ రహిత గ్రామమే మన లక్ష్యం” అంటూ నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ప్లాస్టిక్ వల్ల భూమి సారవంతం దెబ్బతింటుందని, పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, భావితరాలకు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్య వివరించారు.ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుర్రం భావన మహేందర్, ఉప సర్పంచ్ మూగల సంజీవచారి లాంఛనంగా ప్రారంభించారు
. ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టినందుకు ఉపాధ్యాయుడు చిన్నయ్యను, విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కడకుంట్ల ఆదిత్యరాజ్, ఎస్ఎంసి మాజీ చైర్మన్ జక్కుల రాజేంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచ్ అన్నవేణి వేణు, నాయకులు కొమురయ్య, సోమా రమేష్ రెడ్డి, మారంపెల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, చెట్పల్లి మారుతీ, వేంకటాద్రి, అయోధ్య సర్పంచ్ గంగాధర్, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.