prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:32 pm Digital Edition : PRAJA VANI

ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు – మహిళల ప్రాణాలతో చెలగాటం

*ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు – మహిళల ప్రాణాలతో చెలగాటం!*

*చర్యలు తీసుకోవాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్*

*జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి):* ప్రైవేట్ హాస్పిటల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ డిమాండ్ చేశారు.
సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో ఏవోకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రతినిధి బృందం అందజేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దినదినము అభివృద్ధి చెందుతున్న జనగామ జిల్లాకు ఆనుకొని ఉన్న యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల మండలాల నుండి జనగామ జిల్లాలో చికిత్స కోసం వస్తున్న అమాయకులను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలకు వైద్యం సరైన రీతిలో అందించడం లేదని ఆరోపించారు.
సరైన వసతులు, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్ వంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, నైపుణ్యం కలిగిన డాక్టర్లు లేకుండా మత్తు ఇంజక్షన్ ఎవరు చేస్తున్నారో తెలియక, ఆపరేషన్ ఏ డాక్టర్లు చేస్తున్నారో కూడా తెలియక అమాయక ప్రజల వద్ద వేలకొద్దీ ఫీజులు వసూలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు.
ఈ మధ్యకాలంలో ప్రైవేటు హాస్పిటల్ లో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోయినట్లు పత్రికల ద్వారా వచ్చిందని, ఇది మధ్య దళారులు, డాక్టర్ల మధ్య ప్రజల మధ్య వ్యాపారంగా మారిందని అన్నారు. అధికారులు వెంటనే జనగామ జిల్లాలోని సంబంధిత అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న, ఉపాధ్యక్షులు పోతుకునూరి ఉపేందర్, గోసంగి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.