prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 1:05 pm Digital Edition : SRINIVAS RAMAGUNDAM

ప్రేమ, ఈర్ష్యతో యువతి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

 

గోదావరిఖని యువతి మృతి కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

గోదావరిఖని, సెప్టెంబర్ 20: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్య నేపథ్యంలో యువతిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్ (38), సింగరేణిలో ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం!

పోలీసుల వివరాల ప్రకారం.. నవీన్ కుమార్‌కు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడి, అది ప్రేమ సంబంధంగా మారింది. యువతి అనంతరం హైదరాబాద్‌లోని ఓయూ పరిధిలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ కోసం గోదావరిఖనికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది.

యువతి తనకు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతిని హత్య చేయాలని ముందస్తుగా పథకం రచించినట్లు వెల్లడించారు.

పురుగుల మందు బలవంతంగా తాగించి హత్య

సెప్టెంబర్ 12న విధులు ముగించుకుని ఆటోలో వెళ్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద నవీన్ తన కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం వివిధ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో గొడవపడి, ముందుగా సిద్ధం చేసుకున్న పురుగుల మందును బలవంతంగా తాగించినట్లు పోలీసులు తెలిపారు.

యువతితో బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యువతి అపస్మారక స్థితికి చేరుకున్నప్పటికీ వెంటనే ఆసుపత్రికి తరలించకుండా జాప్యం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

యువతి తండ్రికి ఆమె ఫోన్‌ నుంచే కాల్ చేసి, ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం రాత్రి సమయంలో యువతిని ఇంటికి తీసుకెళ్లి, ఆమె తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి నవీన్ కుమార్ పరారైనట్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు యువతి మృతి చెందింది.

ఆధారాల ధ్వంసానికి యత్నం

నేరం బయటపడుతుందనే భయంతో నిందితుడు కారును కడగడం, సూసైడ్ నోట్, పురుగుల మందు బాటిల్, మొబైల్ సిమ్‌లను తొలగించడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయినట్లు వెల్లడించారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుల అరెస్ట్

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు.

ప్రధాన నిందితుడు నవీన్ కుమార్‌ను గోదావరిఖని బ్రిడ్జి, గంగానగర్ ప్రాంతంలో, మరో నిందితుడు రవికుమార్‌ను ఓసీపీ-5 మైన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రవికుమార్‌పై ఆరోపణలపైనా దర్యాప్తు

మృతురాలు శిక్షణ కోసం గోదావరిఖనికి వచ్చిన సమయంలో రవికుమార్ ఆమెతో పరిచయం పెంచుకుని, ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అలాగే మృతురాలు సింగరేణి అధికారులకు సమర్పించిన దరఖాస్తు, అందులోని ఆరోపణలు, అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరుగుతోందని వెల్లడించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు

  • నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు
  • నిందితులకు చెందిన రెండు సెల్‌ఫోన్లు