prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:55 pm Digital Edition : PRAJA VANI

ప్రభుత్వ భూమిని కాపాడాలి.. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి!

ప్రభుత్వ భూమిని కాపాడాలి.. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి!

లాక్నావరం–జయగిరి శివారుల్లో తవ్వకాలు, బండల పేలుళ్లపై ఫిర్యాదు

సర్వే నంబర్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని తహసీల్దార్‌కు వినతి

బండల పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయంటున్న గ్రామస్థులు

జయగిరి, సెప్టెంబర్ 22, ప్రజావాణి:
హసన్‌పర్తి మండలం జయగిరి, లాక్నావరం శివారుల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, అనుమతులు లేకుండా మైనింగ్‌, గ్రానైట్‌ తవ్వకాలు, బండల పేలుళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జయగిరి గ్రామానికి చెందిన కొత్తకొండ కృష్ణంరాజు, తండ్రి వీరాస్వామి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

లాక్నావరం శివారులోని సర్వే నంబర్‌ 69/1లో సుమారు 12.10 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ భూమిలో పైల్ల మహిపాల్‌రెడ్డి, తండ్రి బాల్‌రెడ్డి, ఆయన బంధువులు అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో బండల పేలుళ్లు, గ్రానైట్‌ తవ్వకాలు, రాళ్లను పగలగొట్టే పనులు జరుగుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా పైల్ల మహిపాల్‌రెడ్డికి జయగిరి శివారులోని సర్వే నంబర్లు 31, 32, 33లో మాత్రమే పట్టా భూమి ఉందని పేర్కొన్నారు. లాక్నావరం శివారులోని బండిమెట్టు గుట్ట ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఏ భూమికి వర్తిస్తాయో అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు.

బండల పేలుళ్లతో భయాందోళనలు

తరచూ బండల పేలుళ్లు జరపడంతో భారీ శబ్దంతో పాటు దుమ్ము కాలుష్యం ఏర్పడుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుళ్ల ప్రభావంతో నూతనంగా నిర్మించిన ఇళ్లు, భవనాలకు పగుళ్లు వస్తున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

సమగ్ర సర్వే చేయాలి

లాక్నావరం సర్వే నంబర్‌ 69/1తో పాటు జయగిరి సర్వే నంబర్లు 31, 32, 33లను రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి భూముల హద్దులను నిర్ధారించాలని కోరారు. సర్వే పూర్తయ్యే వరకు సంబంధిత తవ్వకాలు, రాళ్లను పగలగొట్టే పనులు, బండల పేలుళ్లను నిలిపివేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు.

ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతో పాటు గ్రామ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కొత్తకొండ కృష్ణంరాజు, జయగిరి గ్రామ ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేశారు.