*ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు, బూట్ల పంపిణీ*
*విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం..*
*-సర్పంచ్ ప్రవీణ్ నాయక్*
*విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు.. కొత్తపేట పాఠశాలలో సందడి*
ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17:
బయ్యారం మండలంలోని కొత్తపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం సందడి నెలకొంది. పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టులను కొత్తపేట గ్రామ సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టుల పంపిణీతో పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు, ప్రీ-ప్రైమరీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.