ప్రభుత్వ పాఠశాలలో డీపీటీ, టీడీ టీకాలపై అవగాహన
టీకా కేవలం ఇంజక్షన్ కాదు.. ఆరోగ్యానికి రక్షణ కవచం: హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు
షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 12:
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో డీపీటీ, టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని షాద్‌నగర్ సబ్‌సెంటర్ ‘సి’ ఏరియా శ్రీనివాస కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు టీకాలు వేసి, వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు విద్యార్థులకు డీపీటీ, టీడీ టీకాల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీపీటీ అంటే డిఫ్తీరియా, పర్టుసిస్ (కోరింత దగ్గు), టెటనస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకా అని తెలిపారు. డిఫ్తీరియా వ్యాధి ప్రధానంగా గొంతు, శ్వాసనాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన అంటువ్యాధి అని వివరించారు. పర్టుసిస్ లేదా కోరింత దగ్గు చిన్నారుల్లో తీవ్రమైన, దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుందని చెప్పారు.
అదేవిధంగా టెటనస్ వ్యాధి గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా కారణంగా సంభవిస్తుందని, దీని వల్ల కండరాలు బిగుసుకుపోవడం, దవడ కదలకపోవడం, తీవ్రమైన కండరాల సంకోచాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విద్యార్థులకు వివరించారు.
డీపీటీ, టీడీ వంటి టీకాలు నిర్ణీత వయస్సులో తీసుకోవడం ద్వారా సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. టీకా వేసిన ప్రదేశంలో స్వల్పంగా నొప్పి, వాపు, ఎర్రబడటం లేదా తేలికపాటి జ్వరం రావడం సాధారణమేనని, సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అయితే జ్వరం లేదా ఇతర లక్షణాలు ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలని తెలిపారు.
టెటనస్ వంటి వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, ముందుగానే టీకా ద్వారా రక్షణ పొందడం ఎంతో ఉత్తమమని శ్రీనివాసులు పేర్కొన్నారు. “టీకా అనేది కేవలం ఒక ఇంజక్షన్ కాదు.. మన ఆరోగ్యానికి రక్షణ కవచం” అని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన 10 మంది విద్యార్థులకు డీపీటీ టీకా, పది సంవత్సరాల వయస్సు కలిగిన 16 మంది విద్యార్థులకు టీడీ టీకా అందించినట్లు హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తెలిపారు.
కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు లక్ష్మీదేవమ్మ, వనజ, ధనలక్ష్మి, మాధవచారి, ఏఎన్‌ఎంలు రమాదేవి, కవిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.