*ప్రత్యేక బాణీలతో ప్రజా కవి సబ్బు నాగయ్య…!
*ఆనాడు మాజీ ఎమ్మెల్యే పై పాట తో కొనసాగుతున్న నాగన్న ప్రస్థానం…
*విపరీతంగా ఆకర్షిస్తున్న బాణిలు ఆయన సొంతం
*కడు పేదరికం అయినా పాటకు ప్రాణం పోస్తున్న నాగన్న
సెంటు భూమి లేదు.. తన ఆలోచనలతో బాణీలు కట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలనే లక్ష్యంతో కడు పేదరికం మధ్య జీవనం కొనసాగిస్తూ పాటలకు ప్రాణం పోస్తూ బాణీలను పొందుపరిచి ప్రైవేటు ఫోక్ సాంగ్లను పరిచయం చేస్తూ విశేషంగా ఆకర్షిస్తున్న ప్రజాకవి సబ్బు నాగన్న పై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన సబ్బు నాగయ్య కి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజుపేట గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరై దాంట్లో నివాసం ఉంటున్నట్లు నాగయ్య తెలిపారు. కాగా గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గ్రామ నివాసి కందాల ఉపేందర్ రెడ్డి పై ప్రత్యేక అభిమానంతో స్వయంగా పాట రాసి బాణీలను కూర్చి యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడంతో విశేషంగా ఆకర్షించినట్లు సమాచారం. అనంతరం ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇటీవల వారం క్రితం రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఓ పాటను రాసి (ఆ పాట పేరు గెలుపే తప్ప ఓటమి ఎరుగవు అన్నా శీనన్న మా పొంగులేటి శీనన్న అనే పాట యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం పాట విశేషంగా ఆకర్షిస్తున్నట్లు తెలిసింది. సమాజాన్ని మేల్కొల్పాలని చైతన్యవంతమైన పాటలను అందించాలనే లక్ష్యంతో పేదరికం లో మగ్గుతున్నప్పటికీ కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలి పనులు చేస్తూ తన ఆలోచనలను పాట రూపంలో మార్చి రాసి ప్రత్యేక బాణీలు పొందుపరిచి ప్రైవేటు పాటలను ఆవిష్కరించడం విశేషం. కాగా చిన్నప్పటినుండి కవితలు రాస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ ఉన్న సమయంలో ఆర్థిక బాధలు వేధించడంతో ఇంటర్ వరకు చదివి కూలి నాలీ పనులకు వెళ్లినట్లు తెలిసింది. నిజమైన కళాకారులకు రచయితలకు ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు అండగా నిలిచి భరోసా ఇవ్వాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.