prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 7:30 am Digital Edition : PRAJA VANI

ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

•ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

•పటాన్చెరులో మైపాల్ రెడ్డి పిలుపుమేరకు రాస్తారోకో ధర్నా

•ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్ర: మాద్రి పృథ్వీరాజ్‌ ఆగ్రహం

పటాన్‌చెరు, సెప్టెంబర్ 7(ప్రజావాణి): అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై నిరసన ధర్నా నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గూడెం మధుతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు మాద్రి పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం నేరమా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను అడ్డుకునేలా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పృథ్వీరాజ్‌ అన్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ఎంపిఆర్‌ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.