ప్రజావాణి అర్జీలను వారంలోగా పరిష్కరించాలి
జాప్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (మన ప్రజావాణి):
ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 81 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా వారంలోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని ప్రాధాన్యంగా పరిగణించి, సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.