prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 7:26 pm Digital Edition : MAHESH MEDCHAL

ప్రజలకు సమస్యల పరిష్కారానికి గంటలేనా?*

*ప్రజలకు రోజుకు రెండు గంటలేనా?*

*ఎల్లంపేట్ కమిషనర్ తీరుపై బీజేపీ నేత కంచుగంట మహేష్ విమర్శలు*

*ప్రజలకు అందుబాటులో ఉండే సమయాన్ని పెంచాలని డిమాండ్*

మేడ్చల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ కమిషనర్ ప్రజల వినతులు స్వీకరించేందుకు రోజుకు కేవలం రెండు గంటలు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ ఎల్లంపేట్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం మున్సిపల్ అధికారుల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్యం, ఆస్తి పన్ను తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగాలు, వ్యాపారాలు వదులుకుని వచ్చే సామాన్య ప్రజలకు కేవలం రెండు గంటల సమయం కేటాయించడం సమంజసం కాదన్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలు, వృద్ధులు కమిషనర్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, సమయాభావంతో పలువురు తమ సమస్యలను తెలియజేయకుండానే వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు పొందుతున్న అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించకూడదని మహేష్ అన్నారు.
కమిషనర్ తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని, కార్యాలయ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన సమయాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ఆలకించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. ఈ విషయంలో కమిషనర్ వెంటనే స్పందించి ప్రజలకు సముచితమైన సమయం కేటాయించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సంఘాలు, స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కంచుగంట మహేష్ హెచ్చరించారు.