prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 1:07 pm Digital Edition : PRAJA VANI

పోస్టుమార్టం కోసం గంటల తరబడి నిరీక్షణ

*పోస్టుమార్టం కోసం గంటల తరబడి నిరీక్షణ*

••మృతదేహంతో ఆసుపత్రి వద్ద బంధువుల పడిగాపులు

••. ఫోరెన్సిక్ వైద్యుడి కోసం ఎదురుచూపులు

తంగళ్లపెల్లి, ప్రజావాణి
తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బొల్లారం శంకరయ్య (58) సోమవారం సాయంత్రం తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా తదితర పోలీసు ఫార్మాలిటీలను పూర్తి చేశారు.మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం శంకరయ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే మధ్యాహ్నం ఒంటిగంట దాటినా పోస్టుమార్టం నిర్వహించే ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ వంశీ ఆసుపత్రికి రాకపోవడంతో మృతదేహంతో బంధువులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

*వైద్యుడి రాక కోసం ఎదురుచూపులు*

ఉదయం 8 గంటలకే మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చినా, పోస్టుమార్టం ఆలస్యం కావడంతో బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పోస్టుమార్టం ఎప్పుడు పూర్తవుతుందో తెలియక ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు.

*సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు*

మృతదేహంతో బంధువులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంపై ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతి కావడంతో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారిన నేపథ్యంలో మరింత జాప్యం జరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని బంధువులు కోరుతున్నారు.
పోస్టుమార్టం నిర్వహణలో జాప్యానికి కారణాలేమిటి? ఫోరెన్సిక్ వైద్యుడు సమయానికి ఎందుకు అందుబాటులో లేరు? మృతదేహంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.