పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసిన దొంగలు.. పెట్రోలింగ్ ఇన్నోవా చోరీ
కరీంనగర్, సెప్టెంబర్ 8(ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాలో వరుస చోరీలతో దుండగులు హల్‌చల్ చేస్తున్న వేళ.. తాజాగా పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల వాహనమే చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ ఇన్నోవా కారును అర్ధరాత్రి సమయంలోగుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు సమాచారం. వాహనాన్ని ఎత్తుకెళ్లిన అనంతరం రాత్రంతా నగరంలో తిరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తెల్లవారుజామున వరంగల్ వైపు వెళ్తుండగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో ఇన్నోవా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం చోరీకి గురైన ఇన్నోవాను సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.
అయితే పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారా? లేదా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ నుంచే పోలీసుల వాహనం చోరీకి గురికావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.