పోచమ్మ ఆలయం, నాయకపోడ్ సామాజిక భవనం ప్రారంభం
దండేపల్లి, సెప్టెంబర్ 14 (సక్రమ ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కుంటలగూడ కట్ట, తట్రాగూడ, జైతుగూడ (నాయకపుగూడ) గ్రామాల ప్రజల ఆరాధ్యదైవమైన పోచమ్మ ఆలయంతో పాటు ఆదివాసీ నాయకపోడ్ సామాజిక భవనాన్ని సోమవారం ప్రారంభించారు.
ఆదివాసీల 20 ఏళ్ల కలను సాకారం చేస్తూ నిర్మించిన ఆలయం, సామాజిక భవనాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అధ్యక్షుడు కొట్నాక తిరుపతి దాతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాణానికి సహకరించిన దాతలు కంది సతీష్ కుమార్, మహ్మద్ ముస్తఫా, ఆలయ స్థల సమస్య పరిష్కారంలో సహకరించిన సందెల శ్రీధర్‌ను గ్రామస్తులు, ప్రముఖులు శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ మాట్లాడుతూ ఆలయ స్థల సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీలంతా ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని కుంటలగూడ కట్ట గ్రామస్తులు నిరూపించారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు.
గిరిజన సహకార సంస్థ అధ్యక్షుడు కొట్నాక తిరుపతి మాట్లాడుతూ ఆదివాసీ యువత ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న మాజీ ఎంపీటీసీ హేమలత–సతీష్, సీనియర్ పాత్రికేయుడు ముస్తఫా సేవలను పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాజుగూడ సర్పంచ్ మారినేని రాజవ్వ–భీమయ్య, సహకార సంఘం పాలకవర్గ సభ్యుడు కాంతారావు, మాజీ సర్పంచులు లింగారావు, దుబ్బరాజం, మాజీ ఉపసర్పంచ్ రాజన్న, కన్నక జంగు, అడై శంకర్, సాదిక్, నజీర్, రవీందర్, కుల పెద్దలు, స్థానిక నాయకులు సాదం రాజేశ్వరి–బాపు, శ్రీనివాస్, ఎర్రయ్య, భీమయ్య, లచ్చన్న, కుంటి భీమయ్య, పుడారి శ్రీను తదితరులు పాల్గొన్నారు