పేదరికాన్ని జయించి.. తెల్లకోటు దిశగా గీతిక!
నీట్‌లో 1,68,372 ర్యాంకు..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు
చెన్నారావుపేట సెప్టెంబర్ 15 ప్రజావాణి
కష్టాలు కళ్లముందున్నా.. లక్ష్యం మాత్రం మనసులో పెట్టుకుంది. పట్టుదలతో చదివి అనుకున్న గమ్యాన్ని చేరుకుంది చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన కుసుమ గీతిక. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె నీట్‌లో 1,68,372 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. మండల కేంద్రానికి చెందిన కుసుమ నరేందర్–కళ్యాణి దంపతుల కుమార్తె గీతిక జూలైలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైంది. తాజాగా విడుదలైన ఫలితాల్లో ప్రతిభ కనబరిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశం పొందింది.చదువుకు పేదరికం అడ్డంకి కాదని తన విజయంతో నిరూపించిన గీతిక.. ఇక వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందనీ,కుమార్తె సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గీతికను బంధువులు, గ్రామస్తులు అభినందిస్తూ భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.