prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 10:25 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం చండూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో పారిశుధ్య సిబ్బందికి సబ్బులు, బెల్లం మరియు కొబ్బరి నూనె ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహితమైన జూట్ బ్యాగుల్లో పంపిణీ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… పారిశుధ్య సిబ్బంది సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి శ్రమ వల్లనే ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు మున్సిపాలిటీ అభివృద్ధిలో అంతర్భాగమని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో కూడా పారిశుధ్య సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మరియు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పునర్వినియోగించగల జూట్ బ్యాగులను వినియోగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ ఎండ, వాన, చలి వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్నారని అన్నారు. వారి ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు “ప్లాస్టిక్‌కు బదులు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా” ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి జూట్, క్లాత్ బ్యాగులను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమములో కౌన్సిలర్ సభ్యులు కొన్రెడ్డి మధు, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ ఖలీల్, మేనేజర్ జి . రాములు వార్డ్ ఆఫీసర్స్ జి. శ్రీరాములు, ఎ. జగన్, బి. సాయిరాం, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్స్ మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడం జరిగింది.