prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 2:12 am Digital Edition : SRIKANTH MULUGU

పస్ర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రవీందర్

పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష

ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వహణపై ఆదేశాలు

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి

నిస్పాక్షికంగా, పారదర్శకంగా సేవలందించాలి

పస్ర (ప్రజావాణి)

ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ములుగు డీఎస్పీ రవీందర్ పస్ర పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కలియతిరిగి పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల వివరాలు, వాటి పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలు అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఎస్పీ రవీందర్ ఆదేశించారు. కేసుల దర్యాప్తులో సాధించిన పురోగతిని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ, కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేలా సేవలు అందించాలని డీఎస్పీ సూచించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిస్పాక్షికంగా విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీస్ శాఖపై మరింత విశ్వాసం పెంపొందించే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో పస్ర సీఐ దయాకర్, ఎస్‌ఐలు తాజుద్దీన్, ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.