prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 5:03 pm Digital Edition : PRAJA VANI

నేరెళ్ల బాధితుల ఇందిరమ్మ ఇళ్లపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి

నేరెళ్ల బాధితుల ఇందిరమ్మ ఇళ్లపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి

నలుగురు అనర్హులు.. ముగ్గురు అర్హులుగా గుర్తింపు

పీడీకి సమగ్ర నివేదిక సమర్పించిన తంగళ్లపల్లి ఎంపీడీవో

తంగళ్లపల్లి, ప్రజావాణి సెప్టెంబర్‌ 24 తంగళ్లపల్లి మండల పరిధిలోని నేరెళ్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశారు. హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మౌఖిక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఇళ్ల పరిస్థితి, కుటుంబ వివరాలు, ఉద్యోగ స్థితి, వాహనాలు, ఇప్పటికే ఉన్న గృహాల వివరాలను పరిశీలించిన అధికారులు అర్హులు, అనర్హులతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను తంగళ్లపల్లి ఎంపీడీవో/ఎఫ్‌ఏసీ డి. రమేష్‌ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు సమర్పించారు.నేరెళ్ల గ్రామానికి చెందిన బంధపురం భూమయ్య మృతి చెందగా, ఆయన భార్య ప్రస్తుతం కుమారుడి వద్ద ఉంటున్నట్లు విచారణలో తేలింది. కుమారుడు విద్యుత్‌ శాఖలో రెగ్యులర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండటంతో ఆ దరఖాస్తును అనర్హంగా అధికారులు నిర్ధారించారు. అదే గ్రామానికి చెందిన కోల హరీశ్‌ ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడంతో అర్హుడిగా గుర్తించారు. ప్రస్తుతం ఎల్‌2 జాబితాలో ఉన్న ఆయన వివరాలను ఎల్‌1 జాబితాలోకి మార్చి కలెక్టర్‌ లాగిన్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే నేరెళ్ల గ్రామానికి చెందిన బందనపురం తిరుపతి విద్యుత్‌ శాఖలో రెగ్యులర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండటంతో అనర్హుడిగా నిర్ధారించారు. జిల్లెల్ల గ్రామానికి చెందిన కొరికంటి గణేష్‌ను అర్హుడిగా గుర్తించినప్పటికీ, ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపలేదని అధికారులు పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన చీకోటి శ్రీనివాస్‌కు నాలుగు చక్రాల వాహనం ఉండటంతో పాటు ఎల్‌3 జాబితాలో ఉండటంతో అనర్హుడిగా పరిగణించారు. జిల్లెల్లకే చెందిన కారికే దేవయ్యకు ఇప్పటికే ఆర్‌సీసీ పక్కా ఇల్లు ఉండటం, ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపకపోవడం, ఎల్‌3 జాబితాలో ఉండటంతో అనర్హుడిగా తేల్చారు.
రామచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన బత్తుల మహేష్‌ను ఇందిరమ్మ ఇళ్లకు అర్హుడిగా గుర్తించి, ఆయన వివరాలను కలెక్టర్‌ లాగిన్‌కు పంపినట్లు ఎంపీడీవో సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత కలిగిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరేలా తదుపరి చర్యలు కొనసాగనున్నాయి.