prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:24 am Digital Edition : PRAJA VANI

నాగులవంచ కళాశాలలో వీడని వివాదం

నాగులవంచ కళాశాలలో వీడని వివాదం

విచారణాధికారిపై విద్యార్థుల తీవ్ర ఆగ్రహం..?

న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం

విద్యార్థుల నిర్ణయం

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

చింతకాని మండలం నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివాదాస్పద ఇంగ్లీష్ అధ్యాపకుడి వ్యవహారం సంచలనంగా మారింది. సంబంధిత అధ్యాపకుడిపై విచారణ చేపట్టేందుకు వచ్చిన అధికారులు సైతం ఆయనకే కొమ్ముకాస్తున్నారని, కళాశాలకు సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పరీక్షల సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లీష్ అధ్యాపకుడు లీగల్ అడ్వైజర్ల సహాయంతో, ఫోన్ ద్వారా సమాధానాలు తెలుసుకుంటూ పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ అక్రమాలకు అధికారులే ప్రత్యక్షంగా సహకరించడం దారుణమని విద్యార్థులు ఆరోపించారు.

*కలెక్టర్‌కు విన్నవించినా దక్కని ఫలితం…?

అధ్యాపకుడి అక్రమాలు, అధికారుల తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో త్వరలోనే డిప్యూటీ సీఎం,మధిర నియోజకవర్గ ప్రజాప్రతినిధి భట్టి విక్రమార్క దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రత్యేక విచారణ అధికారి..

ఆర్జేడీ ఆదేశాల మేరకు ప్రత్యేక విచారణాధికారి గురువారం నాగులవంచ కళాశాలలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. వివాదాస్పద అధ్యాపకుడు వీరాంజనేయులు అంశంపై విద్యార్థులు, కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్ నుంచి వివరాలు సేకరించి పూర్తి నివేదిక సిద్ధం చేశారు. విచారణ సమయంలో లీగల్ అడ్వైజర్‌ను అనుమతించడంపై మొదట కొంత స్పష్టత లేదని, ఆర్జేడీ నిబంధనల ప్రకారం వారే సమకూర్చుకోవాలని భావించినప్పటికీ, చట్టపరమైన అనుమతులు ఉండటంతో లీగల్ అడ్వైజర్‌తో కూడిన వాంగ్మూలాన్నే స్వీకరించినట్లు విచారణాధికారి తెలిపారు.”నేను ఏ ఒక్కరికీ కొమ్ముకాయను. కేవలం మౌఖిక వాంగ్మూలాలకు తావులేకుండా విద్యార్థులు, సిబ్బంది ఇచ్చిన లిఖితపూర్వక సమాచారాన్ని, విచారణలో వెలుగుచూసిన వాస్తవాలనే యథాతథంగా తుది నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేస్తాను” అని విచారణాధికారి స్పష్టం చేశారు.ఈ వివాదం కారణంగా తమ విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని విద్యార్థులు వాపోతున్నారు. వివాదాస్పద అధ్యాపకుడిని వెంటనే కళాశాల నుండి తొలగించి, ఆయన స్థానంలో అనుభవజ్ఞుడైన మంచి ఇంగ్లీష్ అధ్యాపకుడిని నియమించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.