prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 4:34 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నాగలగుంట్ల గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

పోరుమామిళ్ల సెప్టెంబర్ 16 ప్రజావాణి మండలం నాగలగుంట్ల గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. పండుగ పురస్కరించుకుని గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి విచ్చేశారు. గ్రామస్తులు, స్థానిక యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు మరియు హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.గ్రామ యువత, వివిధ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న స్థానికులు ఈ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న నాగలగుంట్ల గ్రామ యువతీ యువకులు పండుగ కోసం ప్రత్యేకంగా సొంత ఊరికి చేరుకున్నారు. గ్రామస్తులు, యువత అందరూ కలిసికట్టుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డిని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఈ ఉత్సవాల్లో పాల్గొని, యువత ఉత్సాహాన్ని అభినందించారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి – పోతిరెడ్డి నాగార్జున రెడ్డి:

ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించి, సకల శుభాలను చేకూర్చే ఆదిదేవుడు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. లోకనాయకుడైన వినాయకుని కృపాకటాక్షాల వల్ల ప్రజలందరి జీవితాల్లో మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు.రైతాంగం బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండి గ్రామాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. గ్రామంలో ఏకతాటిపై నిలిచి,ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, విజయవంతంగా నిర్వహిస్తున్న యువతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాల వికాసంలో యువత పాత్ర కీలకమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగలగుంట్ల గ్రామ పెద్దలు, మహిళలు, యువత, బెంగళూరు మరియు హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిమయ వాతావరణంలో ముగిశాయి.