prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 1:22 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నకిలీ లాయర్, హ్యూమన్ రైట్స్ ముసుగులో ఘరానా మోసం: పోరుమామిళ్ల మండలంలో లక్షల రూపాయల వసూళ్లు!

పోరుమామిళ్ల ( సెప్టెంబర్ 21 ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలో సమాజానికి రక్షణగా నిలవాల్సిన రంగులు మార్చి, నమ్మించి గొంతు కోసే ఒక ఘరానా మోసం వెలుగుచూసింది. తాను ఒక లాయర్ అని, హ్యూమన్ రైట్స్ (మానవ హక్కుల) సంఘం నాయకుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి అమాయక ప్రజలను నిలువునా ముంచిన ఉదంతం మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. చట్టం, హక్కుల ముసుగులో దాక్కున్న ఈ కేటుగాడు దాదాపు 19 మంది బాధితుల నుండి దాదాపు 40 లక్షల వరకు వసూలు చేసి చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. స్థానికులు మరియు బాధితుల కథనం ప్రకారం.. పోరుమామిళ్ల మండల పరిధిలోని పర్రివిండి గ్రామం మరియు పరిసర ప్రాంతాలలో సదరు వ్యక్తి తన మాయమాటలతో ప్రజలను నమ్మించాడు. మీకు తక్కువ వడ్డీకే బ్యాంకు లోన్లు ఇప్పిస్తానని, వివాదాల్లో ఉన్న మీ భూములను ప్రభుత్వ రికార్డులలో ఆన్‌లైన్ చేయిస్తానని నమ్మబలికాడు. లాయర్ కోటు, హ్యూమన్ రైట్స్ బోర్డును చూసి నిజమేనని నమ్మిన సుమారు 19 మంది అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని అతని చేతుల్లో పెట్టారు. ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయల చొప్పున వసూలు చేసిన ఈ మాయగాడు, రోజులు గడుస్తున్నా పనులు చేయకపోగా, బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

కడప ఎస్పీ ఆఫీసులో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనూ బాధితులు:

ఈ మోసగాడి మాయాజాలం కేవలం సామాన్య ప్రజలకే పరిమితం కాలేదు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కొందరు సిబ్బంది కూడా ఇతని చేతిలో మోసపోయినట్లు వినికిడి. చట్టాన్ని రక్షించే శాఖలోనే బాధితులు ఉన్నారంటే ఇతని మోసాలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు.

అసలు ఇతను లాయరా? కాదా?

ప్రస్తుతం పోరుమామిళ్ల మండలంలో సదరు వ్యక్తి గురించి ప్రజలు తీవ్రంగా గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఇతను నిజంగానే చట్టం చదివిన లాయరా? లేక కేవలం కోర్టుల పేరు చెప్పి తిరిగే నకిలీ వ్యక్తినా? మానవ హక్కుల సంఘంలో ఇతనికి అసలు గుర్తింపు ఉందా? లేక ఆ బోర్డును కేవలం వసూళ్లకు మాత్రమే వాడుకుంటున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ గుర్తింపు కార్డులు, బోర్డులతో సమాజంలో చలామణి అవుతూ ఇటు న్యాయవాద వృత్తికి, అటు మానవ హక్కుల సంఘాలకు ఇతను తీవ్ర అపకీర్తి తెస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. నా డబ్బులు ఏయి అని బాధితులు అడిగితే నేను లాయర్ ను మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ బెదిరింపులకు తిరుగుతున్నాడు పోరుమామిళ్ల మండలంలోనే కాకుండా కడప జిల్లాలో కూడా ఉన్నారు బాధితులు అతి త్వరలో వాళ్ళు కూడా మీడియా మొఖానికి రావాలని వేచి చూస్తున్నారు, ఈ ఘరానా మోసంపై పోలీస్ శాఖ మరియు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి, ఈ ముసుగు వీరుడి అసలు రంగు బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగి, వారి డబ్బులు వారికి తిరిగి వచ్చేలా చూడాలని, ఇలాంటి నకిలీ రాయుళ్లపై కఠిన చట్టాలు ప్రయోగించాలని పోరుమామిళ్ల ప్రజలు కోరుతున్నారు. ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల వేదనను “ప్రజావాణి” రేపటి సంచికలో ప్రత్యేక కథనంతో మీ ముందుకు తీసుకురానుంది.