*దసరా నాటికి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి*
*తరిగొప్పుల మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – 17 మందికి అందజేత*
జనగామ జిల్లా ప్రతినిధి (తరిగొప్పుల), సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
తరిగొప్పుల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మొదటి జాబితాలో అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు రూపొందించిన జాబితాలోని L2, L3 కేటగిరీలను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన పేదలకు ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని సూచించారు.
*దసరా కానుకగా రైతుల పొలాలకు నీరు అందించాలి*

తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, మోటార్లు చేరాయని, వాటి బిగింపు పనులతో పాటు విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. జీవీఆర్ ఏజెన్సీ, ఇంజనీర్లు, ఇరిగేషన్, ఎలక్ట్రికల్ అధికారులతో చర్చించానని, పనులను వేగవంతం చేసి *ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి లిఫ్ట్ పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.
*అంకం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే*

అనంతరం తరిగొప్పుల గ్రామ మాజీ ఉపసర్పంచ్ అంకం శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆయన తల్లి రాములమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.