దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర మహాసభలు
• అక్టోబర్ 7న సంగారెడ్డిలో డి జె ఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
• డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి
జోగిపేట, సెప్టెంబర్ 21: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం దళిత జర్నలిస్ట్ ఫోరం (డి జె ఏఫ్ )ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి తెలిపారు.
ఈ సందర్భంగా జోగిపేట ఆర్డీఓ రమేష్ బాబు చేతుల మీదుగా డి జె ఏఫ్ 11వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
సంగారెడ్డిలోని PSR గార్డెన్ ఫంక్షన్ హాల్, పటాన్‌చెరువు X రోడ్ వద్ద నిర్వహించనున్న ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా దళిత జర్నలిస్టులు, జిల్లా కమిటీలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివక్ష, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమని తెలిపారు. దళిత జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు అక్రిడిటేషన్ సౌకర్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత, ఇళ్ల స్థలాలు, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదిగ బుచ్చయ్య, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.