prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:14 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దళితులపై దాడులు చేసిన భూకబ్జాదారులను వెంటనే అరెస్టు చేయాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశి నాయన సెప్టెంబర్ 23 ప్రజావాణి మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పరిధిలో దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుని, వారిపై భౌతిక దాడులకు తెగబడిన వైసిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం కలసపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సగిలి గురవయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు లాజరస్, యర్జా లు మాట్లాడారు. దళితులపై దౌర్జన్యానికి దిగిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాశి నాయన మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్లు 129, 130, 131, 217లలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను 2018వ సంవత్సరం నుండి వరికుంట్ల, నాయన పల్లె గ్రామాలకు చెందిన పేదలు, దళితులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే, గత వైసిపి ప్రభుత్వ హయాంలో అగ్రవర్ణాలకు చెందిన భూకబ్జాదారులు, వైసిపి నాయకుడు సత్యనారాయణ రెడ్డి (అలియాస్ నల్ల సత్యం), ఆయన కుమారుడు గోవింద్ రెడ్డి స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి, అధికార బలంతో ఈ వందలాది ఎకరాల పేదల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు.పేదలకు దక్కాల్సిన భూములను కాపాడుకునేందుకు గత ఐదు రోజుల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాధితులు వరికుంట్ల, నాయన పల్లె భూముల వద్దకు వెళ్తుండగా, సత్యనారాయణ రెడ్డి, గోవింద్ రెడ్డి వారి అనుచరులతో కలిసి దళితులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని నేతలు మండిపడ్డారు. పేదలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే, అగ్రవర్ణ అహంకారంతో, రాజకీయ బలంతో దాడులు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్

దళితుల భూములను లాక్కొని, వారిపై దౌర్జన్యాలు చేస్తున్న వైసిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి, గోవింద్ రెడ్డిలను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భూ అక్రమాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇటువంటి భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితులకు న్యాయం జరిగే వరకు, ఆక్రమణకు గురైన భూములను తిరిగి పేదలకు అప్పగించే వరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం స్థానిక నాయకులు, బాధితులు మరియు వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.