prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 7:25 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ గడ్డది కీలక పాత్ర – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

*తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ గడ్డది కీలక పాత్ర – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 26 (ప్రజావాణి):
జిల్లా లోని బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అయితే తొలి మహిళా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. నిజాం, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా ఎదిరించి పోరాడారని తెలిపారు.

భూమి, హక్కులు, సమానత్వం, ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాల ప్రజలు సాగించిన పోరాటంలో ఐలమ్మ కీలక స్ఫూర్తిగా నిలిచారని, తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు 4 వేల మంది అమరులయ్యారని, 20 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటానికి జనగామ ప్రాంతం గర్భగుడిగా నిలిచిందని, ఈ గడ్డ నుంచే పోరాట స్ఫూర్తి విస్తరించిందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మను కేవలం ఒక కులానికో, సామాజిక వర్గానికో పరిమితం చేయడం ఆమె పోరాట చరిత్రను చిన్నచూపు చూడటమేనని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

బైరాన్‌పల్లి, కూటికల్లు తదితర ప్రాంతాల్లో ప్రజలు నిజాం, రజాకార్ల అణచివేతను ఎదుర్కొని పోరాడారని, బైరాన్‌పల్లి ఘటనలో 130 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద చరిత్రను ఎప్పటికీ మర్చిపోవద్దని అన్నారు. 1946 నుంచి 1948 వరకు సాగిన ప్రజా పోరాటాలు తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టాలని, ఎలాంటి అణచివేత ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్యం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ఆమె పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.