prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:18 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ భాష కోసమే రాష్ట్ర సాధన

*తెలంగాణ భాష కోసమే రాష్ట్ర సాధన*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

 

తెలంగాణ భాష కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ప్రముఖ వాగ్గేయకారుడు అంబటి వెంకన్న అన్నారు.

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి సందర్బంగా తెలంగాణ భాషా దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అంబటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భాషా పరమైన ఆత్మ గౌరవం కోసమే ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటి జెన్జి తరం ప్రత్యేక తెలంగాణ పోరాట వారసత్వాన్ని తెలుసుకోవాలని అన్నారు. కాళోజి నారాయణ రావు బతికినంత కాలం ప్రజల కోసం పోరాటం చేశారని అన్నారు. ఆయన కవితా సంపుటి “నా గొడవ” నిండా ప్రజల గొడవేనని అన్నారు. ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతని గేయాల్లో రూపుకడతాయని అన్నారు. ఈ సందర్బంగా ఆయన పాడి వినిపించిన తెలంగాణ గేయాలు అలరించాయి. “తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా” అని తెలుగు భాషను మాట్లాడటం రాదని చెప్పడం అవమానమని కాళోజి చాటి చెప్పారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ కాళోజి జీవితాన్ని ఆదర్శoగా తీసుకొని అన్యాయానికి ఎదురు నిలబడాలని యువతకు సూచించారు. కాళోజి తన ఆవేదననంతా స్వచ్ఛమైన తెలంగాణ భాషలో రాశాడని ఇది ఇప్పటికీ ఆదర్శప్రాయమని అన్నారు. పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ చనిపోయినపుడు కాళోజి రాసిన “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అనే కవిత కాళోజికి కూడా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దoడి శ్రీధర్, అధ్యాపకులు డా. జ్యోత్స్న, డా. మల్లేశం, డా. సరిత, డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు, ప్రభాకర్, లింగస్వామి, శ్రవణ్ కుమార్, వనజ, నాజియా, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.