ఘట్కేసర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘట్కేసర్ సీఐ ఎం. బాలస్వామి పిలుపునిచ్చారు. మర్రిపల్లిగూడ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘గణేష్ సురక్ష సంకల్ప్–2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నేరాల కారణంగా భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులకు చెప్పకూడదని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిలుగూరి వికాస్, మాయ బాలకృష్ణ, మాయ మహేందర్‌లకు ప్రశంసాపత్రాలతో పాటు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గోపి, ఎస్‌ఐ శేఖర్ అచన, పోలీసు సిబ్బంది, యువజన సంఘం అధ్యక్షుడు మాయ గోవర్ధన్, సభ్యులు, అర్సీలు పల్లపు సరిత, మేకల కళ్యాణి, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
