prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 6:41 pm Digital Edition : MAHESH MEDCHAL

*డ్రంక్ అండ్ డ్రైవ్‌.. ఇద్దరికి రెండు రోజుల జైలు*

*డ్రంక్ అండ్ డ్రైవ్‌.. ఇద్దరికి రెండు రోజుల జైలు*

*8 ట్రాఫిక్ కేసుల పరిష్కారం.. రూ.12,600 జరిమానా*

మేడ్చల్: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు మేడ్చల్ న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను గురువారం మేడ్చల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జేఎఫ్‌సీఎం న్యాయస్థానం విచారించి పరిష్కరించింది. మొత్తం 8 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను విచారించిన న్యాయస్థానం.. వాటిలో 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం రూ.10,600 జరిమానా విధించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన రెండు కేసుల్లో నిందితులకు రూ.2,000 జరిమానా విధించారు. దీంతో మొత్తం 8 కేసులకు సంబంధించి న్యాయస్థానం రూ.12,600 జరిమానా విధించింది.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం కూడా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా, లైసెన్స్‌తోనే వాహనాలు నడిపి రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు.