prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:28 pm Digital Edition : PRAJA VANI

ట్రాన్స్‌ఫార్మర్‌ తరచూ ఫీజు.. పంటలు ఎండిపోయే ప్రమాదం

ట్రాన్స్‌ఫార్మర్‌ తరచూ ఫీజు.. పంటలు ఎండిపోయే ప్రమాదం
విద్యుత్‌ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలంటున్న చిన్న పోచారం రైతులు
కూసుమంచి ప్రజావాణి – సెప్టెంబర్ 28
కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామ శివారులోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తరచూ ఫీజు అవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కూసుమంచి వెళ్లే బీటీ రోడ్డు పక్కన ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ రెండు రోజులకు ఒకసారి మొరాయిస్తుండటంతో వ్యవసాయ మోటార్లు పనిచేయక పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండటంతో నీటి అవసరం అధికంగా ఉంది. మరోవైపు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పొలాల్లో నేల నెర్రలు పడుతున్నాయని తెలిపారు.
ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు తరచూ విద్యుత్‌ అంతరాయాలతో పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్‌, సాంకేతిక లోపాలను అధికారులు పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే తనిఖీ చేసి, అవసరమైతే సామర్థ్యం పెంచి నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.