*జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా రాందాస్*
*ఘనంగా సన్మానించిన మంచాల మండల ఉపాధ్యాయ సంఘం నాయకులు*
రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 23:( ప్రజావాణి) ఉత్తమ మండల విద్యాధికారిగా మంచాల మండల విద్యాధికారి రాందాస్ ఎంపికైన సందర్భంగా మంచాల మండల ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. మంచాల మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు రాందాస్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే మహత్తర బాధ్యతతో పాటు పాఠశాలల అభివృద్ధికి రాందాస్ అంకితభావంతో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మంచాల మండలంలో విద్యా ప్రమాణాల అభ్యున్నతికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
మండల విద్యాధికారిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యారంగానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు లభించడం రాందాస్ అంకితభావానికి, నిరంతర కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
రాందాస్ మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంచాల మండలం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో అగ్రగామిగా నిలిచిందని డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. మండలంలోని పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు కూడా నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు డాక్టర్ అజ్మత్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి తుల్జారామ్, ఉపాధ్యక్షుడు మండల యాదయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు మోతిలాల్, వెంకట నరసయ్య, సమగ్ర వనరుల ఉపాధ్యాయులు జగదీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..