జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
చిలుకూరు మండలంలోని 17 గ్రామాల్లో పోస్టర్ల ఆవిష్కరణ
చిలుకూరు: కోదాడ నియోజకవర్గంలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువతీ యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గీతం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
జాబ్ మేళాపై అవగాహన కల్పించేందుకు చిలుకూరు మండలంలోని 17 గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు గీతం వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి పిండత్రి హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జాబ్ మేళాలో వందలాది కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి తమకు ఆసక్తి ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ముందుగానే తమ బయోడేటాను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో, కోదాడ శాసనసభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏడవల్లి పుల్లారావు, చిలుకూరు మండల ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమర్నాథ్ బట్టు గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

