జాతీయ కరాటే వేదికపై పోత్కపల్లి విజయగర్జన
రెండు స్వర్ణాలు.. ఒక రజతంతో పీఎం శ్రీ విద్యార్థినుల మెరుపు
క్రీడా ప్రతిభకు క్రమశిక్షణ, పట్టుదలే బలం
జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించారు. ఈ విజయంతో పాఠశాల ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటారు.
హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఏజీఆర్ గార్డెన్స్, బట్టుపల్లిలో ఈనెల 27వ తేదీ ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో పోత్కపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
అండర్–14 వెపన్ డబుల్ నాంచక్ కటాస్ విభాగంలో కందుల అమూల్య అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. అలాగే అండర్–14 కటాస్ విభాగంలో ఎర్ర అస్మిత స్వర్ణ పతకం, గంగారపు కీర్తి రజత పతకం సాధించి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
కరాటే.. కేవలం క్రీడ కాదు
కరాటే అనేది కేవలం పోటీల్లో గెలుపు కోసం నేర్చుకునే క్రీడ మాత్రమే కాదని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల, సమయపాలన, శారీరక దృఢత్వం పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలకు కరాటే శిక్షణ ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు దోహదపడుతుంది.
కఠినమైన సాధన, నిరంతర శిక్షణ, గురువుల మార్గదర్శకత్వం, పోటీతత్వ స్ఫూర్తితో విద్యార్థినులు జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. చదువుతో పాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇస్తే విద్యార్థుల్లో సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ఈ విజయం మరోసారి చాటిచెప్పింది.
విజేతలకు ఘన అభినందనలు
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థినులకు మండల విద్యాధికారి వై. రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల విజయానికి కృషి చేసిన గ్రాండ్ మాస్టర్ కోండిల్ల సదానందంను మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థినులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తూ, పోటీలకు సిద్ధం చేసిన సదానందం కృషిని ప్రశంసించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏభూసి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. కరాటే వంటి క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థినులను, వారికి శిక్షణ అందించిన గ్రాండ్ మాస్టర్ కొండిల్ల సదానందంను అభినందించారు.
ఈ విజయంతో పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పోత్కపల్లి పాఠశాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విజేతలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.