చూపు లేకున్నా వెలుగులు పంచిన లింగయ్య..
ఇద్దరు అంధులకు చూపునిచ్చేలా కుటుంబ సభ్యుల మహోన్నత నిర్ణయం
సూత్రాల రవి అవగాహనతో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం
ఓదెల, జూన్ 17:
కొమిరె గ్రామానికి చెందిన కొట్టూరి లింగయ్య మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న మహోన్నత నిర్ణయం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నేత్రదానం ప్రాముఖ్యతపై సూత్రాల రవి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో, వారు అంగీకరించి లింగయ్య నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు సహకారంతో కార్నియాలను సేకరించి సికింద్రాబాద్ ఐ బ్యాంక్‌కు పంపించారు.

లింగయ్య మరణానంతరం ఆయన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే అవకాశం కల్పించారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన విషాద సమయంలోనూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంది.
లింగయ్య భార్య భూలక్ష్మి, కుమారులు కొట్టూరి రాజయ్య–పద్మ, శ్రీనివాస్–లత, మనుమలు, మనుమరాళ్లు శ్రీనాథ్, అనీల్, శిరీష, నవీన్, చందు, ప్రవీణ్, విజయ్, నిఖిల్, నర్మద తదితర కుటుంబ సభ్యులు నేత్రదానానికి సమ్మతించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి కార్నియాలను సేకరించి సికింద్రాబాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు. తమ కుటుంబ సభ్యుడి మరణాన్ని విషాదంగా మాత్రమే కాకుండా, మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశంగా మార్చడం గొప్ప మానవతా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు.
నేత్రదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, ఈ మహత్తర కార్యక్రమానికి ప్రోత్సహించిన సూత్రాల రవిని కూడా వారు అభినందించారు. సమాజంలో నేత్రదానం, అవయవదానం పట్ల మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసు, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారు రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళి తదితరులు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఓదెల ప్రతినిధులు డాక్టర్ వేణు, క్యాతం మల్లేశం, అల్లం సతీష్, మేరుగు సారంగం, క్యాతం వెంకటేశ్వర్లు, డాక్టర్ వెంకటేశ్వర్లు, సంతోష్, నవీన్ తదితరులు కుటుంబ సభ్యులను అభినందించారు.
మరణం అంతిమం కాదని.. మన కళ్లతో మరో ఇద్దరికి వెలుగు చూపించవచ్చని నిరూపించిన కొట్టూరి లింగయ్య కుటుంబ సభ్యుల నేత్రదాన నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఒక కుటుంబం చూపిన మానవతా దృక్పథం మరో ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగులకు కారణం కానుంది.