prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:50 am Digital Edition : PRAJA VANI

చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి లో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

*చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి లో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు*

మన ప్రజావాణి సంగారెడ్డి నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ :28

*భారీ ర్యాలీ, సభ నిర్వహించి , అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ*

*ఓట్ల తొలగింపే లక్ష్యంగా SIR: ఎంపీ సురేష్ షెట్కార్*

*అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదు: నిర్మలా జగ్గారెడ్డి*

*ఓటర్ల హక్కుల పరిరక్షణకు బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: చంద్రశేఖర్ రెడ్డి*

ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోందని మెదక్ ఎంపీ సురేష్ షెట్కార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓట్ల గల్లంతు, ఎన్నికల కమిషన్‌పై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామ్ నగర్ రామ్ మందిర్ వద్ద గల జగ్గారెడ్డి ఇంటి నుండి మొదలుకుని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ సురేష్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు.

అనంతరం జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం లో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు

*ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం: సురేష్ షెట్కార్*

ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్‌లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ కార్యక్రమాలను కొనసాగించిందని ఆరోపించారు. బీహార్, బెంగాల్ ఎన్నికల్లో భారీగా ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోనూ SIR పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియపై అప్రమత్తంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల వ్యవస్థ చర్యలు తీసుకోవాలని సురేష్ షెట్కార్ కోరారు.

*అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదు: నిర్మలా జగ్గారెడ్డి*

మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు అభ్యంతరాలు, నోటీసులు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీలు, పేదలు, బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు.

ఏళ్లుగా ఒకే ప్రాంతంలో నివసిస్తూ, నిరంతరం ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి సైతం నోటీసులు రావడానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో బూత్‌ల వారీగా పరిశీలిస్తే ఓటర్లకు నోటీసులు రావడం, వివిధ రకాల ధ్రువపత్రాలు సమర్పించాలని కోరడం వంటి అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు.

ఓటు హక్కుకు సంబంధించిన ఏ అక్రమాన్నైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. అర్హులైన ఒక్క ఓటు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

*బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: చంద్రశేఖర్ రెడ్డి*

డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ప్రతి బూత్‌లో ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు అని, అర్హత ఉన్న ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన సమాచారం, ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు సహకరించాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ కంటెస్టెడ్ ఎంపీ నీలం మధు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి, సంగారెడ్డి జిల్లా నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు