*చిలిపిచేడ్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు*
చిలిపిచేడ్, సెప్టెంబర్ 17 ప్రజావాణి
చిలిపిచేడ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి, అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శివప్రసాద్ ఎంపీడీఓ ప్రశాంత్ ఎస్ఐ నర్సింలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ… 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైందని, ఆ రోజును పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఎంపీడీఓ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజా పాలన అంటే ప్రజల కోసం పనిచేసే పాలన అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.