చినుకుపడితే చాలు.. కాగతి యనమసామనపల్లి రోడ్డు జలమయం
మన ప్రజావాణి
చౌడేపల్లి:
కొద్దిపాటి వర్షానికే కాగతి యనమసామనపల్లి రోడ్డు జలమయంగా మారుతోంది. చౌడేపల్లి మండలం కాగతి గ్రామ పంచాయతీ పరిధిలో సరైన వర్షపు నీటి కాలువలు లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ రహదారిపై నీరు నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు కాగతికి చెందిన పాపులమ్మ నివాసముంటున్న పూరిగుడిసెలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. గుడిసె ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
కాలువలు ఉన్నచోట కొందరు వ్యక్తులు వాటిని పూడ్చివేయడంతోనే వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువలను పరిశీలించి, ఆక్రమణలు తొలగించి, వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాపులమ్మ పూరిగుడిసె పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి, ప్రమాదం జరగకముందే తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.