*చాప కింద నీరులా ముంచుకొస్తున్న ముప్పు*
*రాయికల్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):*
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కళ్లతో చూడలేము. కానీ కళ్ల ముందే కనిపిస్తూ, రోజూ మన ఇంట్లోకి చొరబడుతూ మన భూమిని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్న మరో మహమ్మారి ప్లాస్టిక్. ఉదయం పాల కవర్ నుంచి టీ తాగే గ్లాసు, టిఫిన్ పార్సిల్ కవర్, కూరగాయల సంచి, మంచినీటి బాటిల్, షాంపూ డబ్బా, బిస్కెట్ ప్యాకెట్ వరకు మన జీవితం ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది. 1950 వరకు పెద్దగా లేని ఈ ప్లాస్టిక్, ఇప్పుడు మనిషి నరనరాల్లోకి ఎక్కేసింది.మనం వాడి పడేసిన ఒక్క ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవడానికి 500 నుంచి 1000 ఏళ్లు పడుతుంది. అంటే మన తాతలు పడేసిన కవర్ కూడా ఇప్పటికీ భూమిలో చెక్కుచెదరకుండా ఉందన్నమాట. రోజూ కోట్లాది కవర్లు, బాటిళ్లు భూమిలో పేరుకుపోతుండటంతో భూమి ఊపిరాడకుండా పోతోంది. వర్షం నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ అడ్డుగోడగా మారి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. మురుగు కాలువలు, డ్రైనేజీలు ప్లాస్టిక్ తో మూసుకుపోయి చిన్న వర్షానికే రోడ్లన్నీ చెరువులై ఇళ్లలోకి నీరు వస్తున్న పరిస్థితి.ప్లాస్టిక్ ను తగలబెడితే అంతకంటే ప్రమాదం. దాని నుంచి వచ్చే డయాక్సిన్, ఫ్యూరాన్ వంటి విష వాయువులు గాలిలో కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఎండకు, వేడికి ప్లాస్టిక్ కరిగి మైక్రో ప్లాస్టిక్ గా మారుతోంది. ఈ రేణువులు ఇప్పుడు మనం తాగే నీటిలో, తినే ఉప్పులో, చేపల కడుపులో, చివరికి తల్లిపాలలో కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వేడి వేడి టీ, సాంబార్, కూరలను ప్లాస్టిక్ కవర్లో, గిన్నెలో వేసుకుని తింటే ఆ రసాయనాలు నేరుగా రక్తంలో కలిసి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి సంతానలేమి, గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.మూగజీవాలకు జరుగుతున్న అన్యాయం వర్ణనాతీతం. రోడ్లపై తిరిగే ఆవులు, మేకలు, కుక్కలు కవర్లతో సహా చెత్తను తినేస్తున్నాయి. వాటి కడుపులో 20 నుంచి 30 కిలోల వరకు ప్లాస్టిక్ పేరుకుపోయి జీర్ణం కాక నరకయాతన పడి చనిపోతున్నాయి. పొలాల్లో పడేసిన ప్లాస్టిక్ వల్ల పంట దిగుబడి కూడా తగ్గిపోతోంది.ప్రభుత్వం 120 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో 10 రూపాయల కవర్ల బండిల్ యథేచ్ఛగా అమ్ముడవుతోంది. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఇల్లు ఒక ఉద్యమం కావాలి. తాతల కాలంనాటి గుడ్డ సంచి, జ్యూట్ బ్యాగ్ ను మళ్లీ భుజాన వేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు స్టీల్ బాటిల్, క్యారేజీ పట్టుకెళ్లాలి. పిల్లలకు ప్లాస్టిక్ బొమ్మలకు బదులు మట్టి బొమ్మలు ఇవ్వాలి. స్కూళ్లలో, గ్రామసభల్లో ప్లాస్టిక్ నష్టంపై అవగాహన కల్పించాలి. పంచాయతీలు, మున్సిపాలిటీలు చెత్త నుంచి సంపద కేంద్రాలను బలోపేతం చేసి రీసైకిల్ చేయాలి.ప్లాస్టిక్ ను ఈ రోజు మనం తిరస్కరిస్తేనే రేపటి తరం ఆరోగ్యంగా ఊపిరి పీల్చగలుగుతుంది. లేకుంటే మన సమాధులపై కూడా ప్లాస్టిక్ కవర్లే ఎగురుతూ ఉంటాయని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.