prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 8:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చంద్రబాబుపై మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఘాటు విమర్శలు: “ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఆయనే నంబర్ 1”

పోరుమామిళ్ల సెప్టెంబర్ 10 ప్రజావాణి“ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు” అని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన భూ ఆరోపణలను తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పనులకే రంగులు మార్చి తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియా వేదికగా చంద్రబాబు నాయుడి తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు.కోనసీమ జిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి రికార్డులను ధ్వంసం చేసిందని, ప్రజల భూములను కాజేయాలని చూసిందని ఆరోపించడాన్ని నాగార్జున రెడ్డి తప్పుపట్టారు. “దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రజల భూములను ప్రభుత్వం కాజేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా?” అని ఆయన ప్రశ్నించారు. లాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, దశాబ్దాల భూ సమస్యలను పరిష్కరించామని, 22A జాబితా నుండి ఏకంగా 16 లక్షల ఎకరాల భూములను విముక్తి చేశామని చంద్రబాబు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.నిజానికి 22A భూములకు సంబంధించి కేవలం ఒక జీవో (G.O.) మాత్రమే వచ్చిందని, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ (మార్గదర్శకాలు) ఇప్పటివరకు విడుదల కాలేదని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. కనీసం ఒక్క ఎకరా భూమి కూడా ఇప్పటివరకు 22A నుండి విముక్తి కాలేదని, క్షేత్రస్థాయిలో ఏమీ చేయకుండానే అప్పుడే 16 లక్షల ఎకరాలు క్లియర్ చేసేశామని చెప్పుకోవడం చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. తాను చేయని పనిని కూడా చేసినట్లుగా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు.

భూ సర్వే విప్లవం జగన్ ప్రభుత్వానిదే:

రాష్ట్రంలో దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మకంగా భూ రీ-సర్వేను ప్రారంభించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గుర్తుచేశారు. ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ఈ క్రింది విధంగా వివరించారు:

* ప్రారంభం: 2020 డిసెంబర్ 21న అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడు గ్రామంలో సరిహద్దురాయి పాతి, ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్షణ’ పథకాన్ని వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించారు.

* సిబ్బంది నియామకం: దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి 14,000 మంది సర్వేయర్లను రిక్రూట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

* అధునాతన టెక్నాలజీ: సర్వే కోసం 3,240 జి.ఎస్.ఎస్. (GSS) రోవర్లను, వందలాది డ్రోన్లను, నాలుగు హెలికాప్టర్లను మరియు రెండు ప్రత్యేక విమానాలను రంగంలోకి దించారు.

* భూహక్కు పత్రాలు: దాదాపు 30 లక్షల మంది రైతులకు ఆధునిక క్యూ.ఆర్. (QR) కోడ్‌తో కూడిన శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు.

2022 సెప్టెంబర్‌లోనే జారీ అయిన ఆ పాస్ పుస్తకాలపై క్యూ.ఆర్. కోడ్స్ ఉన్నాయని, ఈ టెక్నాలజీ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రూ. 500 కోట్ల రాయితీని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని నాగార్జున రెడ్డి తెలిపారు. ఆ నిధులు వచ్చింది జగన్ చేసిన పనికేనని ఆయన స్పష్టం చేశారు.

లోగోలు మార్చడం తప్ప కూటమి చేసింది ఏముంది?

“క్యూ.ఆర్. కోడ్, జియో హద్దులు, ఏపీఎం (APM) నంబర్లు.. అసలు ఈ మూడింటి అర్థం ఏంటో చంద్రబాబుకు తెలుసా?” అని నాగార్జున రెడ్డి నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన పాస్ పుస్తకాలపై ఉన్న ‘నవరత్నాల’ లోగోను తొలగించి, తమ కూటమి లోగోలు వేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ విప్లవాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తూ.. తామేదో కొత్తగా కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు.

వచ్చే మార్చి నాటికి సమస్యల పరిష్కారం సాధ్యమేనా?

వచ్చే ఏడాది మార్చి లోగా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు ప్రకటించడంపై నాగార్జున రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల తీవ్రతను అర్థం చేసుకోకుండా ఇలాంటి డెడ్‌లైన్లు పెట్టడం హాస్యాస్పదమన్నారు.19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పటికీ అసాధ్యమైన వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాన్ని పక్కనపెట్టి నిజాలు మాట్లాడాలని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు