prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 11:52 am Digital Edition : PRAJA VANI

చండూర్ మున్సిపాలిటీలో నాసిరకం సీసీ రోడ్డు – మధ్యలో 30 మీటర్లు చెరిపివేత – ప్రజాధనం వృధా

*చండూర్ మున్సిపాలిటీలో నాసిరకం సీసీ రోడ్డు – మధ్యలో 30 మీటర్లు చెరిపివేత – ప్రజాధనం వృధా*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (సమగ్ర ప్రజావాణి):*

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీవో కార్యాలయం నుండి మెయిన్ రోడ్ వరకు వేసిన సీసీ రోడ్డు వ్యవహారం వివాదంగా మారింది. కొద్ది నెలల క్రితం వేసిన ఈ సీసీ రోడ్డులో మధ్యలో సుమారు 30 మీటర్ల మేర నాణ్యత లేదని తేలడంతో అధికారులు ఆ 30 మీటర్ల రోడ్డును జేసీబీలతో చెరిపివేస్తున్నారు. సీసీ రోడ్డు మొత్తం బాగుందని, కేవలం మధ్యలో 30 మీటర్ల వరకు మాత్రమే నాణ్యత లోపం ఉందని తేలడంతో ఆ మేరకు తొలగించి మళ్లీ వేయాలని నిర్ణయించారు.

*అయితే ప్రజలు వేస్తున్న ప్రశ్నలు ఇవే:*

30 మీటర్లు నాసిరకంగా వేయడానికి కారణం ఏంటి? సిమెంట్ తక్కువ వేశారా? క్యూరింగ్ చేయలేదా? తప్పు ఎవరిది? నాణ్యత పాటించని కాంట్రాక్టర్ దా? లేక పర్యవేక్షణ చేయని అధికారులదా? ప్రజల డబ్బును ఇలా వృధా చేయడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఒకసారి వేసి, మళ్లీ చెరిపి, మళ్లీ వేయడం వల్ల మున్సిపాలిటీకి అదనపు భారం పడుతుంది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజల పన్నుల డబ్బుతో ఆడుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ స్పందించి, 30 మీటర్ల నాసిరకం రోడ్డుకు కారణమైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ నుండే రాబట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చండూర్ ప్రజలు కోరుతున్నారు.