prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:24 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

*ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ*

*అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ – మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి ):
జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం గంట్లకుంట గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ వీరనారి, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన చాకలి ఐలమ్మ మన పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు.

గంట్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ అసామాన్యమైన ధైర్యంతో ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఒక వర్గానికే పరిమితమైన నాయకురాలు కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయురాలని అన్నారు. తన హక్కుల కోసం, అణగారిన ప్రజల కోసం ఆమె చూపిన తెగువ, ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆమె స్ఫూర్తితో యువత, మహిళలు సామాజిక న్యాయం, సమానత్వం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, చాకలి ఐలమ్మ వారసురాలు చిట్యాల శ్వేతా, స్థానిక సర్పంచ్ పాయిలి యకలక్ష్మి సోమన్న, మండల అధ్యక్షులు రంగు మురళి, వట్టే జనయ్య యాదవ్, కొండ్రాతి శ్రీనాథ్, మాజీ గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి గౌడ్, డా. కూరపాటి రమేష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చైతన్య రజక సంఘం నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.