*ఘనంగా రియాద్‌లో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు*
రాయికల్; సెప్టెంబర్ 20(ప్రజావాణి)
సౌదీ అరేబియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రియాద్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ 5వ విడత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు సౌదీలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది తెలుగు కుటుంబాలు,తెలుగు సంఘాల ప్రతినిధులు, సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబార కార్యాలయ రెండవ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత గడ్డకు వేల మైళ్ల దూరంలో ఉంటూ కూడా తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తూ ఇంత పెద్ద ఎత్తున భాషా దినోత్సవాన్ని నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సౌదీలోని తెలుగు సమాజం క్రమశిక్షణకు, ఐక్యతకు మారుపేరుగా నిలుస్తోందని, తెలుగు ప్రజలంతా ఇదే స్ఫూర్తితో ఐక్యంగా ఉండి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు మల్లేశన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు భాషను, సంస్కృతిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రియాద్ విభాగ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ తెలుగు భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. గ్రాంథిక భాషను వదిలి వ్యావహారిక తెలుగును మనకు అందించిన ఆయన కృషిని స్మరించుకోవాలని అన్నారు. విదేశాల్లో జీవిస్తున్న తెలుగు ప్రజలు ఒకరికొకరు అండగా నిలవాలని, కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళా విభాగ అధ్యక్షురాలు శర్వాణి విద్యాధరాణి మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు ఒకే వేదికపై కలిసి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో జిద్దా విభాగ అధ్యక్షుడు అంజాద్ ఆలపించిన అందమైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, జానపద గీతాలు, సంగీత విభావరి అందరినీ అలరించాయి. చివరగా తెలుగు సంప్రదాయ రుచులతో ఏర్పాటు చేసిన విందు భోజనం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌదీలో ఉన్నప్పటికీ స్వదేశంలో పండుగ జరుపుకున్న అనుభూతి కలిగిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రధాన బృందం, నిర్వహణ బృందం, సేవా బృందం, సాంస్కృతిక బృందాలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన తెలుగు కుటుంబాలకు రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ, ప్రధాన బృంద సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.