prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 12:13 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ సమరభేరి…‘420’ హామీల అమలుపై నిలదీత.. 1,700 మంది రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌…..ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో….

ఘట్‌కేసర్‌, సెప్టెంబర్‌ 7: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఘట్‌కేసర్‌లో ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ చేపట్టిన ఎనిమిది రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఘట్‌కేసర్‌ ఎంఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఘట్‌కేసర్‌ రైతు సహకార సంఘం బ్యాంకు పరిధిలోని సుమారు 1,700 మంది రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం సమర్పించారు.

అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో రాస్తారోకో చేపట్టారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో నాగులపల్లి రమేష్‌, పన్నాల కొండల్‌రెడ్డి, పోచారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ పలుగుల మాధవరెడ్డి, కాకర బ్యాంకు మాజీ చైర్మన్‌ డొంకిని భిక్షపతిగౌడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ డైరెక్టర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.