prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:11 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశం…

గణేష్ ఉత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

 

ఘట్‌కేసర్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశ

 

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 4: గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఘట్‌కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొని ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, నిర్వాహకుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు.

గణేష్ మండపాల నిర్వాహకులు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందడంతో పాటు మండపాల వద్ద సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, తగినంత వెలుతురు, జన నియంత్రణకు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయకుండా విద్యుత్ శాఖ నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు, స్తంభాలను పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖకు సూచించారు.

మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలీసులు శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, సమయ పరిమితులు తదితర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

మత సామరస్యం, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు కోరారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసు, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో పోలీస్ శాఖ నుంచి ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, సబ్‌ఇన్‌స్పెక్టర్ శేఖర్, రాఘవేంద్ర, విద్యుత్ శాఖ నుంచి సహాయ ఇంజనీర్ పవన్, మున్సిపల్ శాఖ నుంచి సహాయ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సహాయ ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.