prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 1:36 pm Digital Edition : MAHESH MEDCHAL

గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

*గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ*

*అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డు అందేలా చర్యలు గరిసెల సురేందర్ ముదిరాజ్*

గౌడవల్లి, సెప్టెంబర్ 23: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి గ్రామంలో నూతన డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని చౌక ధరల దుకాణం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారి అభిషేక్, రేషన్ షాప్ డీలర్ కైరంకొండ శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో కార్డుల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి గౌడవల్లి మాజీ సర్పంచ్, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత ఏర్పడుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ రేషన్ సక్రమంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గౌడవల్లి గ్రామంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ స్మార్ట్ కార్డు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఆయన తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా కార్డు పొందని వారు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి ముదిరాజ్, మాజీ సర్పంచ్ కోరని భగవాన్ దాస్, గౌడవల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్. వినోద్ గౌడ్, రాజు గౌడ్, దాసరి గణేష్ యాదవ్, రమేష్ గౌడ్, నాగులూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాలకుర్తి మురళి గౌడ్, దాసరి శంకర్ యాదవ్, హరి శంకర్, సింగిరెడ్డి రఘుపతి రెడ్డి, గువ్వ సురేష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. రేషన్ డీలర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు, పెద్ద సంఖ్యలో రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.