32 ఏళ్లతర్వాత కలుసుకున్న మిత్రులు.. గురువులకు ఘన సన్మానం
బెజ్జంకి, సెప్టెంబర్ 6 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1993–94 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఒకే వేదికపైకి చేరిన చిన్ననాటి మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా తమకు ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తమ జీవితాలకు విద్యాబాటలు చూపిన గురువుల సేవలను గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగ, వ్యాపార, కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉంటూ ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ జీవిత ప్రయాణంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న కష్టాలు, ఎదురైన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. పాఠశాలలో చదువుకున్న నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, చిన్ననాటి మిత్రులు పాల్గొన్నారు.