prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 5:59 pm Digital Edition : PRAJA VANI

గుగ్గిళ్ల చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

గుగ్గిళ్ల చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు..
చికిత్స పొందుతూ మృతి

బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల చౌరస్తా సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బెజ్జంకి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి గ్రామానికి చెందిన తిప్పారపు సురేష్ (45) వ్యవసాయం, పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సెప్టెంబర్ 27న ఉదయం సుమారు 11:30 గంటలకు ఇంటి వద్ద భోజనం చేసిన అనంతరం ఫోన్ రావడంతో ద్విచక్రవాహనంపై గుగ్గిళ్ల గ్రామానికి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో గుగ్గిళ్ల చౌరస్తా సమీపంలోని రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం సురేష్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సురేష్‌ను 108 సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 28న తెల్లవారుజామున 3:01 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో సురేష్ కుడి మోకాలు, వీపు భాగంలో తీవ్ర గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గుర్తుతెలియని వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి భార్య తిప్పారపు రజిత బెజ్జంకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ గుర్తుతెలియని వాహనం, డ్రైవర్‌ను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.