prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:00 pm Digital Edition : NARESH Nayak RAMAYAMPET

గిరిజన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి

గిరిజన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి
బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన.. నాయకుల అరెస్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన పారిశ్రామికవేత్తలకు పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. “సబ్సిడీ ఆఫీస్ ముట్టడి–చలో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్” కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
బీజేపీ సిటీ కార్యాలయం నాంపల్లి నుంచి కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయం వైపు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ గిరిజన పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా సబ్సిడీలు పెండింగ్‌లో ఉండటంతో అనేక మంది గిరిజన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.
సుమారు రూ.1,700 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న గిరిజన సబ్సిడీలను వెంటనే విడుదల చేసి, సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న సుమారు 3,000 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వివిధ పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలు అమల్లో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక శాఖ వివరాలు పేర్కొంటున్నాయి.
ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నాయకులు తెలిపారు. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షులు లావుడియా రాములు నాయక్ రాష్ట్రఎస్టి మోర్చాకోశాధికారి మధుసూదన్ మెదక్ జిల్లా ఎస్టి మోర్చా ఇంచార్జ ప్రధాన కార్యదర్శి ఫుల్ సింగ్ నాయక్, జిల్లా నాయకులు రాజు నాయక్, అంజి నాయక్, కొల్చారం మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు అంజా నాయక్, హత్నూర మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు అంజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీలను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయడంతో పాటు గిరిజన పారిశ్రామికవేత్తలకు న్యాయం చేయాలని కోరారు.
గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం సరైన చర్య కాదని వారు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేసే వరకు గిరిజనుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు తెలిపారు.