గణనాథుని సన్నిధిలో చిరుతల భజనతో భక్తి పారవశ్యం
ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 18:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నారబోయిన వీరభద్ర౦ గురువుగారి చిరుతల భజన బృందం సభ్యులు గణనాథుని సన్నిధిలో సంప్రదాయ పద్ధతిలో చిరుతలతో భజనలు చేస్తూ భక్తి గీతాలను ఆలపించారు. భజన బృందం సభ్యులు చిరుతల తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, భక్తి గీతాలు పాడుతూ చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గణేశుడి విగ్రహం ఎదుట భక్తి వాతావరణం నెలకొనగా, మహిళలు, యువత, చిన్నారులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. చిరుతల భజనను తిలకించిన గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గడిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇలాంటి సంప్రదాయ భక్తి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు భజన బృందం కళాకారులను అభినందించారు