prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:31 am Digital Edition : PRAJA VANI

గణనాథుడి సన్నిధిలో మతసామరస్యానికి మధుర సందేశం

గణనాథుడి సన్నిధిలో మతసామరస్యానికి మధుర సందేశం

రెడ్డి గణేష్ మండపంలో ముస్లిం సోదరుడి అన్నదానం..

సౌదీ అరేబియాకు వెళ్లే ముందు సేవా సంకల్పం

ఓదెల, సెప్టెంబర్ 14: ఓదెల మండలం పోత్కపల్లిలోని రెడ్డి గణేష్ మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలిరోజున మతసామరస్యానికి ప్రతీకగా నిలిచేలా ముస్లిం సోదరుడు ఎండీ జలీలుద్దీన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
సౌదీ అరేబియాకు వెళ్లే క్రమంలో వినాయకుడి సన్నిధిలో అన్నదానం చేయాలన్న సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు జలీలుద్దీన్ తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో తన ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటూ భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. గతంలోనూ గణేష్ నవరాత్రుల తొలిరోజున ఇదే విధంగా అన్నదానం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
గణేష్ మండపానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేయడంతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొన్న జలీలుద్దీన్‌ను పలువురు అభినందించారు. భక్తి, సేవ, మానవత్వానికి మతాలు అడ్డుకావని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. ఒక మతానికి చెందిన పండుగలో మరో మతానికి చెందిన వ్యక్తి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పోత్కపల్లిలోని ప్రజల మధ్య ఉన్న సోదరభావం, పరస్పర గౌరవం మరోసారి చాటిచెప్పినట్లయింది.
మతాలు వేరైనా.. మానవత్వం ఒక్కటేనన్న సందేశాన్ని అందిస్తూ నిర్వహించిన ఈ అన్నదానం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. గణనాథుడి సన్నిధిలో సేవా భావంతో ముందుకొచ్చిన జలీలుద్దీన్‌ను పలువురు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, మతసామరస్యం, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.