గోవిందరావుపేట మండలంలో వరి పంటకు నీటి కష్టాలు- ఇసుక బస్తాల తో తాత్కాలిక మరమ్మత్తులు
లక్నవరం నీళ్లొచ్చినా.. కాల్వల గండ్లతో రైతులకు తిప్పలు
గోవిందరావుపేట(ప్రజావాణి)
లక్నవరం సరస్సుకు నీరు వచ్చినా రైతుల కష్టాలు తీరడం లేదు. కాల్వలకు గండ్లు పడడంతో పొలాలకు నీరు చేరడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలను నమ్ముకుని రైతులు వరి నాట్లు వేశారు. సొంతంగా చందాలు వేసుకుని మరీ నాట్లు వేసుకున్నారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.ఎట్టకేలకు లక్నవరం సరస్సు నీరు వచ్చినా కాల్వలకు గండ్లు పడటం రైతులకు శాపంగా మారింది. గండ్లు పూడ్చుకుంటూ పడరాని పాట్లు పడుతున్నారు. కాల్వల వెంట ఇసుక బస్తాలు, రాళ్లు, ప్లాస్టిక్ షీట్లు వేసి తాత్కాలికంగా నీటిని మళ్లిస్తున్నారు.
ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు చేయించి, పంట పొలాలకు నీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.